Andhra Pradesh: అవినీతి, అక్రమాలు, వెన్నుపోటుకు చంద్రబాబు మారుపేరు!: వైఎస్ షర్మిల

  • చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
  • టీడీపీ అన్నివర్గాలను మోసం చేసింది
  • రాజమండ్రి బహిరంగ సభలో మండిపడ్డ షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఎలాంటి రక్షణ లేదని వైసీపీ నేత వైఎస్ షర్మిల విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించని చంద్రబాబుకు మరోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బస్టాండ్‌ సెంటర్‌ వద్ద వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. ఏపీలో ఎన్నికల వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

జీతాలు పెంచాలని ధర్నా చేసిన అంగన్ వాడీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు, వెన్నుపోటుకు చంద్రబాబు మారుపేరని అన్నారు. అమరావతికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందనీ, ఆ నిధులను ఏం చేశారని నిలదీశారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ కు ఓటేయాలని ప్రజలను కోరారు.
Andhra Pradesh
YSRCP
Sharmila
Chandrababu
East Godavari District
meeting

More Telugu News