Shivaji: పోలవరంపై కుట్రలు పేరుతో మరో వీడియోను ప్రదర్శించిన నటుడు శివాజీ

  • టీఆర్ఎస్ ఎంపీ కవిత మాట్లాడిన వీడియోను చూపించిన శివాజీ
  • నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నామన్న కవిత
  • రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రులను కలిశామన్న ఎంపీ
  • సుప్రీంకోర్టులో బోల్డన్ని కేసులు వేశామని స్పష్టీకరణ
విలేకరుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వివరించిన సినీ నటుడు శివాజీ.. తాజాగా పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు జరుగుతున్న కుట్రలకు సంబంధించి మరో వీడియోను బయటపెట్టారు. ఆ వీడియోలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును ఇప్పుడున్న డిజైన్‌లో వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

నాలుగేళ్ల నుంచి ఈ విషయంలో కొట్లాడుతున్నట్టు చెప్పారు. పోలవరాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టులో వేసిన కేసులు పెండింగులో ఉన్నట్టు కవిత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రపతిని, గవర్నర్‌ను కలిశామని, కేంద్రమంత్రులను కలిశామని ప్రాజెక్టును ఆపాలని కోరినట్టు కవిత చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పుడున్న డిజైన్‌లో తప్పకుండా వ్యతిరేకిస్తామని మరోమారు స్పష్టం చేశారు.

ఈ వీడియో ముగిసిన అనంతరం శివాజీ మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు ఆలోచించాలని, వారు కోరుకున్న ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదని, దీనికి వారు అంగీకరించరని శివాజీ పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను తిరిగి తెలంగాణ ప్రభుత్వం కలుపుకుంటుందని అన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న పన్నాగమని పేర్కొన్నారు.

నిజానికి జగన్‌పై కేసీఆర్‌కు కూడా అంత ప్రేమ ఉందని తాను అనుకోవడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీలోని ప్రతీ గడపను తడుపుతుందని, కాబట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Shivaji
Polavaram
Andhra Pradesh
K Kavitha
TRS
KCR

More Telugu News