Chittoor District: కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీడీపీ అభ్యర్థులకు ఏపీ మాజీ మంత్రి మద్దతు

  • గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసుపులేటి బ్రహ్మయ్య
  • రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి చెంగల్రాయుడు, ఎంపీ అభ్యర్థి సత్యప్రభను గెలిపించాలని అభ్యర్థన
  • నవ్యాంధ్ర నిర్మాణానికి కష్టపడుతున్న చంద్రబాబుకు మద్దతు అవసరమన్న మాజీ మంత్రి
గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య ఆసుపత్రి నుంచే టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు, ఎంపీ అభ్యర్థి  సత్యప్రభకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆసుపత్రి నుంచి ఓ నోట్ విడుదల చేశారు. నిజానికి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని భావించానని, అయితే అనుకోని కారణాల వల్ల బరిలోకి దిగలేకపోయానని తెలిపారు.

అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గ ప్రజలను కలవలేకపోతున్నానని పేర్కొన్న బ్రహ్మయ్య.. ఏపీ అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్న చంద్రబాబుకు మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 40కిపైగా ఐటీ కంపెనీలు, సెల్‌కాన్ వంటి మొబైల్ కంపెనీలతోపాటు అనంతపురంలో కియా కార్ల కంపెనీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, బత్యాల చెంగల్రాయుడు, సత్యప్రభను భారీ మెజారిటీతో గెలిపించాలని బ్రహ్మయ్య కోరారు.
Chittoor District
Andhra Pradesh
pasupuleti bhrahmaiah
Rajampeta
satyaprabha

More Telugu News