Jana Sena: నరసాపురం లోక్ సభ వైసీపీ అభ్యర్థి కారుపై రాళ్ల దాడి

  • రఘురామ కృష్ణంరాజుకు తప్పిన ముప్పు
  • వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది
  • జనసేన కార్యకర్తల పనే అంటున్న వైసీపీ
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు కాస్తలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాళీపట్నంలో జనసేన సభ జరుగుతున్న సమయంలో రఘురామ కృష్ణంరాజు కాన్వాయ్ అటుగా వెళుతుండగా ఈ దాడి జరిగింది.

దుండగులు ఆయన కారునే కాకుండా మరో కారును కూడా లక్ష్యంగా చేసుకుని రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రఘురామ కృష్ణంరాజు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ తరుణంలో సెక్యూరిటీ సిబ్బంది రావడంతో ఆ వ్యక్తులు నిదానించారు.

రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగిందని తెలియగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాళీపట్నం చేరుకున్నారు. జనసేన కార్యకర్తలే తమ నేతపై దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. నరసాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున రఘురామకృష్ణంరాజు పోటీచేస్తుండగా, జనసేన నుంచి మెగాబ్రదర్ నాగబాబు బరిలో ఉన్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ లోక్ సభ స్థానంపై ఆసక్తి ఏర్పడింది.
Jana Sena
YSRCP

More Telugu News