Andhra Pradesh: రూ.10,000 కోట్లతో బీసీ బ్యాంకు.. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు!: చంద్రబాబు కీలక ప్రకటన

  • సొంతిళ్లతో పేదరికంపై గెలుపు సాధిస్తాం
  • టీడీపీ విజయం ఇప్పటికే ఖరారైపోయింది
  • బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
తెలుగు ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో పేదరిక నిర్మూలనకు ఏటా పసుపు-కుంకుమ పథకం కింద సాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. రైతన్నలపై ఆర్థికభారం తగ్గించేందుకు అన్నదాతా-సుఖీభవను అమలు చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేందుకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’, పేదల ఆరోగ్య పరిరక్షణకు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అమరావతిలో టీడీపీ బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అందరికి సొంతిళ్లు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలుపు సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదరికం లేని సమాజమే టీడీపీ లక్ష్యమని ఏపీ సీఎం ప్రకటించారు. రూ.10,000 కోట్లతో బీసీ బ్యాంకును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముస్లిం సోదరుల కోసం ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మౌజన్, ఇమామ్ లకు నెలకు రూ.3 వేల పెన్షన్ అందిస్తామన్నారు. వైసీపీ, ఎంతకైనా దిగజారుతుందనీ, ఆ పార్టీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

టీడీపీ విజయం ఏకపక్షం అని ఇప్పటికే ఖరారై పోయిందన్నారు. అసహనంతోనే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చేస్తున్న తప్పుడు పనులు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని వ్యాఖ్యానించారు.

కొందరు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన టీడీపీని అధికారానికి దూరం చేయలేరని స్పష్టం చేశారు. కేవలం దర్యాప్తు సంస్థలనే కాకుండా ఎన్నికల సంఘాన్ని కూడా మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు మార్గంలో ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
BJP
Narendra Modi
Amit Shah

More Telugu News