Chandrababu: చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీఇన్నీ కావు: విజయవాడ రోడ్ షోలో వైఎస్ జగన్

  • బాబు పాలనలో మనం చూసింది మోసాలు, అబద్ధాలే
  • టీడీపీ నేతలు మహిళలకు అప్పులిచ్చి వేధించారు
  • విజయవాడలో తాగునీటి సమస్య అలానే ఉంది
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది మోసాలు, అబద్ధాలేనని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పాలన అంతా మోసమని, టీడీపీ నేతలు మహిళలకు అప్పులిచ్చి వేధించారని ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో నిందితులైన నేతలను కేసుల నుంచి చంద్రబాబు తప్పించారని విమర్శించారు.

కేశినేని ట్రావెల్స్ పై కేసులు పెట్టారని విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఓ ఐపీఎస్ అధికారిపై దౌర్జన్యం చేశారని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓ డాక్టర్ ను బోండా ఉమ ఎలా బెదిరించారో అందరికీ తెలుసని అన్నారు. ఈ ఐదేళ్లలో దుర్గగుడి ఫ్లై ఓవర్ కట్టించ లేకపోయారని, దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారంటే బాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ ధ్వజమెత్తారు.

విజయవాడలో తాగునీటి సమస్య పరిష్కారానికి, గుణదల వంతెన, ఫ్లైఓవర్ ముంపునకు గురవుతున్నా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదని మండపడ్డారు. రాజధాని అమరావతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే తప్ప శాశ్వత భవన నిర్మాణాలే లేవని దుయ్యబట్టారు. రాజధాని పేరిట సింగపూర్, జపాన్ అంటూ ప్రజలకు సినిమా చూపిస్తున్నారని, ఈ ఐదేళ్లలో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఎదిగారని, రైతు మాత్రం పేదవాడిగానే మిగిలిపోయాడని విమర్శించారు. 
Chandrababu
Telugudesam
YSRCP
jagan
Vijayawada

More Telugu News