Telugudesam: ఎన్నికలప్పుడు ఇలాంటి తనిఖీలు సాధారణమే: సీఎం రమేష్ నివాసంలో సోదాలపై ద్వివేది
- ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో సోదాలు చేస్తున్నాం
- ప్రతి ఫిర్యాదుపైనా స్పందిస్తున్నాం
- పోలీసులపై ఫిర్యాదులు నిజం కాకపోవచ్చు
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసులు సోదాలు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి తనిఖీలు నిర్వహించడం సాధారణమైన విషయం అని అన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోని అన్ని ఇళ్లలో సోదాలు నిర్వహించారని ద్వివేది వెల్లడించారు. మరీ సమస్యాత్మకం అనిపించిన గ్రామాల్లో కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల సందర్భంగా తమకు గుంటూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీల నుంచి అందిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపించినట్టు చెప్పారు. కొన్ని సందర్భాల్లో పోలీసులపైనా ఫిర్యాదులు వచ్చాయని, అయితే అవన్నీ నిజం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.
ఇవాళ తెల్లవారుజామున పోట్లదుర్తిలో టీడీపీ నేత సీఎం రమేష్ నివాసంలోకి పెద్ద ఎత్తున పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ చర్యతో టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. కేంద్రం జరిపిస్తున్న దాడులంటూ మండిపడ్డారు.