BJP: ఏపీ ప్రజలకు పవన్‌కల్యాణ్‌ తానే ఓ ప్రశ్నగా మిగిలారు!: బీజేపీ నేత సోము వీర్రాజు సెటైర్‌

  • ఆశలు పెట్టుకున్న సామాజిక వర్గాన్ని ముంచేశారు
  • ఒకరికి కొమ్ముకాసే వ్యక్తిగా ఆయన మిగిలిపోతారు
  • మాయావతికి సాష్టాంగ పడడం విడ్డూరం
ఎవరినైనా ప్రశ్నిస్తా? అంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తానే ఓ ప్రశ్నగా మిగిలిపోయారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఆయన ఏదో చేస్తారని ఆశలు పెట్టుకున్న సొంత సామాజిక వర్గం నమ్మకంపైనా నీళ్లు చల్లారని, ఒకరికి కొమ్ముకాసే వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోనున్నారని అన్నారు.  ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావించినప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి వెళ్దామని సూచించింది ఆయనేనని అన్నారు. ఆ తర్వాత ఓ సామాజిక వర్గం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడంతో పథకం ప్రకారం టీడీపీపై విమర్శలు చేశారన్నారు.

చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కు వెళ్తుందని చెప్పిన ఈ పెద్దమనిషి తాజాగా డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. సొంత సామాజిక వర్గాన్ని ముంచిన పవన్‌ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తం కావడానికి కారకుడయ్యారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఎస్పీ నేత మాయావతికి పవన్‌ సాష్టాంగ నమస్కారం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులను చంద్రబాబు దిగమింగారని ఆరోపించారు. రాజధాని నిర్మాణమే చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలరని ఎద్దేవా చేశారు. మట్టి, ఇసుక తవ్వకాల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు.
BJP
Jana Sena
Telugudesam
somuveerraju
Pawan Kalyan

More Telugu News