ఎన్నికలకు ముందు ఎస్పీ-బీఎస్పీలకు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రవీణ్ నిషాద్
- గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో ఎస్పీ టికెట్‌పై గెలిచిన ప్రవీణ్
- గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న నిషాద్
- మళ్లీ అదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత గోరఖ్‌పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యానాథ్‌ను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న ఎస్పీ-బీఎస్పీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్‌ను బరిలోకి దింపాయి. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన సంచలన విజయం సాధించారు. కాగా, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీలు మరోమారు చేతులు కలిపాయి. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు విషయంలో భేదాభిప్రాయాల కారణంగా నిషాద్ పార్టీ ఇటీవల ఈ కూటమి నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు ప్రవీణ్ నిషాద్ ఏకంగా బీజేపీలో చేరి ఆ రెండు పార్టీలకు షాకిచ్చారు.