Andhra Pradesh: ఇలాంటి వ్యాఖ్యలు మానుకో చంద్రబాబూ.. లేదంటే నాలుక చీలుస్తాం!: బీజేపీ నేత సోము వీర్రాజు వార్నింగ్

  • చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలే
  • దొంగ లెక్కలు చూపి అవార్డులను దక్కించుకున్నారు
  • అనంతపురంలో మీడియాతో బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం అవినీతి, అక్రమాలే చోటుచేసుకున్నాయని విమర్శించారు. దొంగలెక్కలు చూపిన ఏపీ ప్రభుత్వం అవార్డులు దక్కించుకుందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు విడుదల చేస్తే, ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీర్రాజు మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీ తల్లిపై చంద్రబాబు వ్యాఖ్యలను సోము వీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు పదేపదే ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీలుస్తామని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తానే ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కేంద్రం రూ.7 వేల కోట్లు విడుదల చేస్తే.. చంద్రబాబు ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అవినీతిపై దమ్ముంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Andhra Pradesh
Telugudesam
BJP
Chandrababu
somu
veeerraju
Anantapur District

More Telugu News