Arvind Kejriwal: ఏపీలో ప్రచారానికి నేనెందుకొచ్చానంటే.. వెల్లడించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • ఈ ఐదేళ్లలో దేశాన్ని బీజేపీ నాశనం చేసింది
  • ఏపీ, ఢిల్లీలు కలిసి తమ హక్కులు సాధించుకుంటాయి
  • జగన్‌ను ఆడిస్తోంది మోదీనే
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి గురువారం కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రధాని మోదీ జేబులో మనిషని, ఆయనకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని హెచ్చరించారు. ఏపీ, ఢిల్లీలు కలిసి సమష్టిగా పోరాడి తమ హక్కులు సాధించుకుంటాయని పేర్కొన్నారు. కాగా, తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రచారానికి తాను ఎందుకు వచ్చిందీ వెల్లడించారు.  

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఈ ఐదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి దేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. దేశానికి వీరిద్దరూ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విభజించారని మండిపడ్డారు. భావసారూప్యత కలిగిన చంద్రబాబు తమలాంటి వారితో కలిసి పోరాడుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వైసీపీని మోస్తున్నది బీజేపీ, మోదీయేనన్నది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును బలోపేతం చేయాల్సిన బాధ్యత తనతోపాటు అందరిపైనా ఉందని, రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
Arvind Kejriwal
New Delhi
Andhra Pradesh
Narendra Modi
YSRCP
Jagan
Chandrababu

More Telugu News