Andhra Pradesh: ఎన్నికలను వాయిదా వేయకపోతే కోటిమంది యువత ఎన్నికలను బహిష్కరిస్తుంది: కేఏ పాల్
- మా పార్టీ బీ ఫారాలు ఎత్తుకెళ్లారు
- ఈసీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది
- ఎన్నికల సంఘం అధికారులతో పాల్ భేటీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు. తమ పార్టీకి చెందిన బీ ఫారాలను టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఎత్తుకెళ్లారని, ఆ బీ ఫారాల సాయంతో పలు చోట్ల టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను నిలబెట్టాయని పాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయిన సందర్భంగా పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీ ఫారాల విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించేందుకు ఎన్నికల సంఘం తనను పిలిపించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారిలో చాలామంది తమ పార్టీకి చెందినవారు కాదని, బలవంతంగా బీ ఫారాలు ఎత్తుకెళ్లినవాళ్లని వివరించారు. అందుకే ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేకపోతే కోటిమంది యువత ఈ ఎన్నికలను బహిష్కరిస్తుందని అన్నారు. తనకు సెక్యూరిటీ లేదని ఈసీకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని కేఏ పాల్ మండిపడ్డారు.