Andhra Pradesh: యనమలకు పంటినొప్పి వస్తే విదేశాల్లో చికిత్స తీసుకోవచ్చా.. సామాన్యులు పక్క రాష్ట్రంలో చికిత్స తీసుకుంటే బిల్లులు ఆపేస్తారా?: వైఎస్ జగన్ ఆగ్రహం

  • మహిళలకు రక్షణగా ఉంటానని చంద్రబాబు చెప్పారు
  • బీసీ పిల్లలు రీయింబర్స్ మెంట్ అందక ఇబ్బంది పడుతున్నారు
  • సంతనూతలపాడు బహిరంగ సభలో వైసీపీ అధినేత
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళల భధ్రత తన బాధ్యత అని చంద్రబాబు చెప్పారని వైసీపీ అధినేత జగన్ గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి లాక్కుని వెళ్లినా, విజయవాడలో కాల్ మనీ రాకెట్ యథేచ్ఛగా సాగుతున్నా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడారు.

ఏపీలో ఓవైపు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతుంటే, మద్యం షాపులు పెరిగిపోయాయని జగన్ విమర్శించారు. ‘నారాయణ స్కూళ్లలో ఫీజులు గుంజడానికి 6,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా బెల్ట్‌ షాపులే కనబడుతున్నాయి. పోలీసు స్టేషన్‌లు పెరగకపోయినా, ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా మాత్రం పెరిగిపోయింది.

బాబు ప్రత్యేక విమానంలో తిరుగుతారు. కానీ 108కి ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే విదేశాల్లో చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవారు పక్క రాష్ట్రంలో చికిత్స చేసుకుంటే బిల్లులు ఆపేస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు ఇలా అన్నీ పెరిగిపోయాయి’ అని విమర్శించారు.
Andhra Pradesh
Yanamala
Jagan
YSRCP
Prakasam District
Chandrababu
Telugudesam

More Telugu News