Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఐపీఎస్ అధికారుల బదిలీపై పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు!

  • ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీల బదిలీ
  • నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • బదిలీలు తాత్కాలికమేనని చెప్పిన ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ బదిలీలకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసింది. దీంతో ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వెంకటేశ్వరరావు సీఎం భద్రతను చూస్తారనీ, ఎన్నికల నిర్వహణతో ఆయనకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేయడం సరికాదని వాదించింది. మరోవైపు ఈసీ న్యాయవాది స్పందిస్తూ.. ఈ బదిలీలు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఈ బదిలీలు ఎలాంటి శిక్ష కాదనీ, ఓసారి పోలింగ్ పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని తేల్చిచెప్పారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
Andhra Pradesh
High Court
Telugudesam
Chandrababu
3 ips
quash

More Telugu News