YSRCP: జనసేనకు ఓటేస్తామన్నందుకు భార్యాభర్తలపై వైసీపీ సానుభూతిపరుడి దాడి..ఇంటికి తాళం వేసి గెంటేసిన వైనం!

  • అనారోగ్యం కారణంగా ప్రచారానికి రాలేమన్న దంపతులు
  • వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశం
  • తాగొచ్చి గర్భిణిపై దాడి.. బయటకు గెంటి ఇంటికి తాళం
ఆరోగ్యం బాగాలేదని, ఎన్నికల ప్రచారానికి రాలేనని వేడుకున్న దంపతులపై జగన్ పార్టీ సానుభూతిపరుడు రెచ్చిపోయాడు. వారిపై దాడి చేసి ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. అర్ధరాత్రివేళ తాగొచ్చి భార్యాభర్తలు ఇద్దరినీ బయటకు గెంటేసి తాళం వేశాడు. మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేశాడు. విశాఖపట్టణంలోని గాజువాకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలోని పిట్టవీధికి చెందిన ఎన్.నాగమణి-సిద్ధు దంపతులు. వీరికి మూడేళ్ల పాప ఉండగా, నాగమణి ప్రస్తుతం నిండు గర్భిణి. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి అయిన నాగేశ్వరరావు ఇంట్లో వీరు మూడేళ్లుగా అద్దెకుంటున్నారు. ఇటీవల ఇంటి యజమాని వారి వద్దకు వచ్చి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి రావాలని, ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే, నాగమణి గర్భిణి కావడంతో తాము రాలేమని చెప్పారు. అయినా, తాము పవన్ అభిమానులమని, ప్రచారానికి రాలేమని చెప్పారు.

వారు అలా చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు వారితో గొడవపడ్డాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. తమకు కొంత సమయం కావాలని మొత్తుకున్నా వినిపించుకోలేదు. రాత్రి నాగేశ్వరరావు, వారి బంధువులు తాగి వచ్చి మరోమారు గొడవ పడ్డారు. నాగమణి జుట్టుపట్టుకుని బయటకు తోసేశారు. దీంతో ఆమె ఇనుప గ్రిల్ తగిలి కిందపడిపోయింది. దంపతులు ఇద్దరినీ బయటకు లాగేసి ఇంటికి తాళం వేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, బాధితుల ఆరోపణలను నాగేశ్వరరావు ఖండించాడు. అద్దె బకాయిలు ఎగ్గొట్టేందుకే వారీ ఆరోపణలు చేస్తున్నారన్నాడు.
YSRCP
Jana Sena
Visakhapatnam District
Gajuwaka
Andhra Pradesh

More Telugu News