YSRCP: పెనమలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగిన భార్యాభర్తలు

  • వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పార్థసారథి
  • స్వతంత్ర అభ్యర్థిగా భార్య కమల
  • కుమారుడి నామినేషన్ తిరస్కరణ
రాష్ట్రంలో ప్రచార పర్వం ఊపందుకున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఈ తరుణంలో అక్కడక్కడా ఎన్నికల విచిత్రాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు ప్రత్యర్థుల్లా బరిలో దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండగా, ఆయన అర్ధాంగి కమల ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. కమలకు ఎన్నికల సంఘం బెల్టు గుర్తు కేటాయించింది. పెనమలూరు నుంచి ఈసారి పదిమందికి పైగా బరిలో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నుంచి పార్థసారథి, జనసేన మద్దతిస్తున్న బీఎస్పీ అభ్యర్థి లంక కమలాకర్ రాజు ప్రధానంగా కనిపిస్తున్నారు.

కాగా, పార్థసారథి, ఆయన భార్య కమల మాత్రమే కాకుండా కుమారుడు నితిన్ కృష్ణ కూడా నామినేషన్ వేసినా, స్క్రూటినీ సమయంలో తిరస్కరణకు గురైంది. లేకపోతే, ఫ్యామిలీ అంతా పెనమలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉండేవాళ్లు!
YSRCP
Telugudesam
Krishna District

More Telugu News