Andhra Pradesh: కేసీఆర్ ఏపీకి రూ.500 కోట్లు భిక్షం వేస్తున్నాడు.. అవసరమైతే నేనే రూ.500 కోట్లు అతనికి భిక్షం వేస్తా!: ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం

షార్ట్స్‌లో చూడండి
నేరచరిత్ర ఉన్నవాళ్లే జగన్ చుట్టూ ఉన్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ పట్టిసీమ ప్రాజెక్టుకు, హంద్రినీవా ప్రాజెక్టుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరానికి కూడా అడ్డుపడ్డారని వ్యాఖ్యానించారు. ఎవరు దేనికి అడ్డుపడ్డా తాను బుల్లెట్ లా దూసుకువెళతానని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈరోజు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

జగన్ కోర్టుకు వెళ్లినా, ట్రైబ్యునల్ కు వెళ్లినా తాను భయపడలేదని చంద్రబాబు అన్నారు. ‘ఐదేళ్ల పాటు ప్రాజెక్టుల పక్కన, కాలువల పక్కనే పడుకున్నా. కేసుల విషయంలో అప్రమత్తంగా ఉన్నా. పుట్టపర్తికి చెందిన ఒకే ఒక రైతు నన్ను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు తమ్మూళ్లూ.. అది నాకు ఇప్పటివరకూ జ్ఞాపకం ఉంది. ఎందుకూ పనికిరాని భూమికి నీళ్లు తీసుకొస్తే నాకు అడ్డుపడ్డారు’ అని విమర్శించారు. అన్నికష్టాలు ఎదురైనా బెదరకుండా రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామనీ, ఉద్యానవన పంటకు కేంద్రంగా మారుస్తామని అన్నారు.

ఒకప్పుడు అనంతపురం అంటే కరవు జిల్లా అనీ, ఇప్పుడు ఆనందమయమైన జిల్లా అనీ, ఆనందనగరి అని వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం చేసి అనంతపురం చరిత్రను పూర్తిగా మారుస్తామని స్పష్టంచేశారు. త్వరలోనే క్షత్రియులు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సామాజికవర్గాల్లోని నిరుపేదలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో టీడీపీని దెబ్బతీయాలని ప్రధాని మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. మోదీపై తాను సమర్థవంతంగా పోరాడుతాననీ, దానికి ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.

తెలంగాణలో కేసీఆర్ పని ఏపీ ఆస్తులను కొట్టేయడమేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను కొట్టేసి కట్టుబట్టలతో పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమరావతి శంకుస్థాపన రోజున రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నా. కానీ మోదీ బాధపడతాడు అని ఇవ్వలేదు’ అని కేసీఆర్ చెప్పాడన్నారు. రూ.లక్ష కోట్లు కొట్టేసి, ఏపీకి రావాల్సిన ఆస్తులను ఇవ్వని కేసీఆర్ రూ.500 కోట్లు భిక్షం వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ డబ్బులు తమకు వద్దనీ, అవసరమైతే తానే రూ.500 కోట్లు కేసీఆర్ కు భిక్షం వేస్తానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దాయాదాక్షిణ్యాలపై తాము లేమని స్పష్టం చేశారు. అమరావతి విషయంలో కేసీఆర్ కు కుళ్లు పట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. అందులో భాగంగానే కేసీఆర్, మోదీ జగన్ కు వేల కోట్ల రూపాయలు పంపారని విమర్శించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
KCR
500 crore

More Telugu News