Telugudesam: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూసి నిర్ణయం తీసుకోండి... ఎన్నికల సంఘాన్ని కోరిన దివ్యవాణి

  • ఎన్టీఆర్ జీవితంలో విషపుచుక్క లక్ష్మీపార్వతి
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనుకున్నది వైసీపీ నేతలే
  • సెన్సార్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మండిపాటు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత దివ్యవాణి నేతృత్వంలో దేవీబాబు, బ్రహ్మం చౌదరి తదితరులతో కూడిన టీడీపీ బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూసి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ దివ్యవాణి ఈసీని కోరారు. ఈ సినిమా నిర్మాతలు వైసీపీకి చెందినవారేనని, ఈ చిత్రం వెనుక ఉన్నది కూడా వైసీపీయేనని ఆమె స్పష్టం చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకుండా చూడాలని, ఓ కమిటీ వేసి ఆ సినిమాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఓ విషపుచుక్క లాంటిదని దివ్యవాణి మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ గురించి అందరూ ఎన్నికల్లో పోరాడుతుంటే, అవినీతికి, అక్రమాలకు నిలయమైన ఓ పార్టీ కేసీఆర్ తో తాము కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ సినిమాకు చెందినవాళ్లు ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని కలిసి ఆయన నుంచి ఎలాంటి లేఖ తీసుకోకుండానే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి సినిమా రిలీజ్ కు క్లియరెన్స్ తీసుకున్నట్టు తమకు తెలిసిందని దివ్యవాణి మీడియాకు తెలిపారు. అందుకే ఇవాళ తాము ఈసీని కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. 
Telugudesam
YSRCP

More Telugu News