Telugudesam: కశ్మీర్ దిగ్గజం ఫరూక్ అబ్దుల్లాను కడప గడ్డపై ఆకాశానికెత్తిన చంద్రబాబు

  • దేశంలో నంబర్ వన్ పొలిటీషియన్ అబ్దుల్లా
  • ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన వ్యక్తి
  • పిలవగానే వచ్చారంటూ హర్షం వ్యక్తం చేసిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లాలో ప్రచారానికి తరలి వచ్చారు. కడపలో ముస్లిం వర్గం ఎక్కువగా ఉండే ఏరియాలో రోడ్ షో నిర్వహించిన ఆయన 'సలామలేకుం, సలామలేకుం' అంటూ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా తనకోసం కశ్మీర్ నుంచి వచ్చిన సీనియర్ రాజకీయవేత్త ఫరూక్ అబ్దుల్లాపై ప్రశంసల వర్షం కురిపించారు.

దేశంలో ఉన్న నంబర్ వన్ సీనియర్ పొలిటీషియన్ ఫరూక్ అబ్దుల్లా అని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి కూడా కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఫరూక్ అబ్దుల్లా సైతం నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించారని, ఆయన తనయుడు ఒమర్ కూడా ముఖ్యమంత్రిగా చేశారని చంద్రబాబు వివరించారు. దేశంలో అత్యంత గౌరవనీయ రాజకీయ కుటుంబంగా ఫరూక్ అబ్దుల్లా కుటుంబాన్ని కొనియాడారు.

ఫరూక్ అబ్దుల్లాకు మన రాష్ట్రం అంటే ఎంతో అభిమానం అని, అప్పట్లో కాంగ్రెస్ మన రాష్ట్ర సర్కారును బర్తరఫ్ చేసినప్పుడు ఆయన మనకు ఎంతో మద్దతుగా నిలిచారని, అందుకే ఎన్టీఆర్ కు ఆయనంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం, దేశం పట్ల ఆయనకు ఉండే అచంచలమైన భక్తి తిరుగులేనివని చెప్పారు. దేశం బాగుండాలని కోరుకునేవాళ్లలో ఆయన అగ్రగణ్యుడని చంద్రబాబు వివరించారు. తాను ఎన్నికల ప్రచారం కోసం రావాలని పిలవగానే ఆయన రావడం అభినందనీయం అన్నారు.
Telugudesam
Chandrababu

More Telugu News