Chandrababu: సిగ్గుందా జగన్ నీకు? ఈ గడ్డమీద పుట్టావా? లేక లోటస్ పాండ్ లో పుట్టావా?: చంద్రబాబు ఫైర్
- విమర్శల జోరు పెంచిన బాబు
- ఒంగోలు రోడ్డు షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- జగన్ పై విరుచుకుపడ్డ వైనం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచార ఉద్ధృతిని మరింత పెంచారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు తీవ్రతకే పరిమితమైన చంద్రబాబు ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, ఒంగోలు రోడ్ షోలో మాత్రం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజక్ట్ వద్దంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తికి, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నావు, జగన్ నీకు అసలు సిగ్గుందా? పౌరుషం ఉందా? అని ప్రశ్నించారు.
జగన్ ఈ గడ్డమీదే పుట్టాడా? లేకపోతే ఎక్కడ పుట్టాడు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లోటస్ పాండ్ లో పుట్టాడు కాబట్టే అక్కడివాళ్లతో లాలూచీ పడి రాష్ట్ర వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని చంద్రబాబు తూర్పారబట్టారు. "ఖబడ్దార్ జగన్ మోహన్ రెడ్డీ! హైదరాబాద్ వెళ్లిపో, అక్కడే పోటీ చేయ్, కేసీఆర్ వద్ద మంత్రిగా పనిచేయ్, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం వదిలిపెట్టను, జాగ్రత్తగా ఉండు. ప్రజలకు అన్యాయం చేస్తే ఇక్కడ తిరగలేవు" అంటూ చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.