Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులపై హామీల జల్లు కురిపించిన జగన్!

  • హోంగార్డులు, కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు
  • ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణం
  • ఆదోని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ప్రకటన
ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే, పోలీస్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలతో పాటు వారానికి ఓరోజు సెలవు ఇస్తామని ప్రకటించారు. ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10,000 రుణం అందిస్తామని తెలిపారు. నవరత్నాలతో ప్రతీఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ బాసులకు సీఎం చంద్రబాబు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని జగన్ తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన గిమ్మిక్కులకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఆదోని నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నాలుగు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి. ఐదేళ్లుగా నీళ్లు అడుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకర్‌ను దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కట్టించారు. ఇక్కడ తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఉంది.

నాన్నగారి హయాంలో బైపాస్‌ రోడ్డు గురించి మూడు బిట్‌లు పూర్తి చేస్తే చంద్రబాబు మిగిలిన ఒక్క బిట్‌ను పట్టించుకోలేదు. ఆదోని రెవిన్యూ డివిజన్‌లో ఒక్క డిగ్రీ కాలేజ్‌ లేదు. ఉన్న ఎయిడెడ్‌ కాలేజీలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల చదువులు ఎండమావులుగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్లు 14 మంది. కానీ ఐదుగురు డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు’ అని జగన్ చెప్పారు.

తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మిస్తే.. రెండు జిల్లాలలోని 659 గ్రామాలకు తాగు నీటి దాహం తీర్చవచ్చనీ, ఇన్నాళ్లూ దీన్ని పట్టించుకోని చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారని దుయ్యబట్టారు. వైసీపీ తరఫున ఆదోనీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి , కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌లకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Kurnool District
adoni
Jagan
YSRCP
Police
Chandrababu
Telugudesam

More Telugu News