Pawan Kalyan: జగన్‌కు సరైన మొగుడు విశాఖలో ఉన్నాడు: పవన్ కల్యాణ్ హెచ్చరిక

  • కేసీఆర్‌తో కలిసి ఏపీని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు
  • అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో పెట్టిన మీడియాలో పిచ్చిరాతలు
  • చిన్నాన్న రక్తపు మరకలు తుడిచేసిన వ్యక్తి ప్రజానాయకుడా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్ నిర్ణయిస్తున్నారని అన్నారు. దోచుకున్న డబ్బుతో మీడియా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోనని, గౌరవిస్తున్నానని చిన్న చూపు చూస్తే సహించబోనన్నారు. పులివెందుల వేషాలు తన వద్ద వద్దంటూ జగన్, విజయసాయిరెడ్డిలకు హెచ్చరికలు జారీ చేశారు.

తాను ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను అమ్ముకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని, తనకు డబ్బుతో పనిలేదని స్పష్టం చేశారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోతే వేలిముద్రలు, రక్తపు మరకలు తుడిచేసి దుస్తులు మారుస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రంలోని ఆడపడుచులను ఎలా కాపాడతారని పవన్ నిలదీశారు. హత్య చేసింది ఎవరో తెలియకుండా రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చిన్నాన్న చనిపోతే రక్తపు మరకలను తుడిచివేసిన వ్యక్తి ప్రజానాయకుడు అవుతారా? అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో ఆంధ్రులను పీల్చి పిప్పి చేస్తుంటే ఒక్క మాటా మాట్లాడకుండా జగన్ నాటకాలాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసి బీఫారాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద జగన్ తాకట్టుపెట్టారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరిగిన జగన్ సమస్యలు తీర్చమంటే మాత్రం ముఖ్యమంత్రి అయ్యాకే తీరుస్తానని చెప్పారని ఎద్దేవా చేశారు. జగన్‌కు కరెక్టు మొగుడు వైజాగ్‌లో ఉన్నారని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అక్కడ నిలబెట్టానని పవన్ చెప్పుకొచ్చారు. జగన్ వైజాగ్ వెళ్తే ఆయన సంగతి తేలుస్తారని పవన్ హెచ్చరించారు.  
Pawan Kalyan
Jagan
YSRCP
Jana Sena
Krishna District
KCR
TRS

More Telugu News