Andhra Pradesh: చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారు.. అందుకే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు!: సి.రామచంద్రయ్య

  • బాబును మరోసారి సీఎం చేయడమే మీ టార్గెటా?
  • అర్ధరాత్రి జేడీని జనసేన అభ్యర్థిగా ప్రకటించారు
  • ఏపీలో శాంతిభద్రతలపై ఈసీ దృష్టిపెట్టాలి
చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. అందులో భాగంగానే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా ‘తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబుకు గొడుగుపట్టి ఆయనను మరోసారి సీఎం చెయ్యడమే నీ టార్గెటా..? అని ప్రశ్నించారు. జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబును అర్ధరాత్రి రహస్యంగా కలిశాడనీ, ఆ తర్వాత జేడీ జనసేన తరఫున పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారన్నారు. కడప జిల్లాలో ఈరోజు మీడియాతో సి.రామచంద్రయ్య మాట్లాడారు.

పవన్ కల్యాణ్ ఓ మిస్టర్ కన్ఫ్యూజన్‌గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై మాట్లాడని పవన్.. జగన్ వస్తే భూములు ఖాళీ అవుతాయని చెబుతున్నారని దుయ్యబట్టారు. గతంలో లోకేశ్ పై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు జనసేన తరఫున సరైన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గాడి తప్పుతున్న శాంతి భద్రతలపై ఎన్నికల కమిషన్‌ దృష్టిపెట్టాలని రామచంద్రయ్య సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ప్రత్యేక పరిశీలకులను పంపాలన్నారు. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu
Nara Lokesh
Jagan
YSRCP

More Telugu News