Chandrababu: వివేకా శవానికి జగన్ మామ బ్యాండేజ్ కట్టారు: చంద్రబాబు
- పులివెందులలో ఇంట్లోనే వివేకాను చంపేశారు
- ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరిగింది
- టీడీపీ అధినేత ఆరోపణలు
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివేకా హత్యకేసును ప్రస్తావించి జగన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. పులివెందులలో ఇంట్లోనే వివేకాను చంపేశారని ఆరోపించారు. అనంతరం ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేశారని, ఈ సందర్భంగా వివేకా శవానికి బ్యాండేజ్ కట్టింది జగన్ మామేనని అన్నారు. వివేకా హత్యకేసును అందరూ అర్థం చేసుకోవాలని, శవ రాజకీయాలు చేస్తోంది ఎవరో గమనించాలని సూచించారు.
బాబాయ్ ను చంపి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే ప్రజలు ఇంట్లో ప్రశాంతంగా పడుకునే వీలుంటుందా? రాష్ట్రంలో రక్షణ ఉంటుందా? రాష్ట్రం మరో పులివెందుల కావాలా? అని ప్రశ్నించారు. వీళ్లను గెలిపిస్తే ఇంటికో రౌడీ తయారుకావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ వ్యవస్థలపై నమ్మకంలేని వ్యక్తులు తెలంగాణలోనే ఉండడం మంచిదని జగన్ కు చురకలంటించారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో కోడికత్తి పార్టీల డ్రామాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అసెంబ్లీకి రాకపోయినా జీతాలు మాత్రం తీసుకుంటారని, ఢిల్లీలో నరేంద్ర మోదీకి భయపడి పార్లమెంటుకు వెళ్లరని చంద్రబాబు విమర్శించారు.