India: బాంబు దాడులకు చెక్కుచెదరని బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారుచేసిన మహీంద్రా
- సాయుధ బలగాల కోసం ప్రత్యేకంగా డిజైన్
- 'మార్క్స్ మన్' పేరుతో తయారీ
- పవర్ ఫుల్ ఇంజిన్ ఏర్పాటు
భారత్ లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా ఉన్న మహీంద్రా సంస్థ తాజాగా రక్షణ రంగ అవసరాల కోసం సరికొత్త వాహనాన్ని తీసుకువచ్చింది. దాని పేరు మార్క్స్ మన్. బాంబులు వేసినా చెక్కుచెదరని రీతిలో ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. మహీంద్రా గ్రూప్ అనుబంధ సంస్థ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ మిలిటరీ వెహికల్స్ ఈ వాహనాన్ని రూపొందించింది.
ఇది ప్రధానంగా బుల్లెట్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్ వాహనం. తుపాకీ కాల్పులు, మందుపాతరల పేలుళ్లు దీన్ని ఏమీ చేయలేవని కంపెనీ వర్గాలంటున్నాయి. దీంట్లో ఆరుగురు కూర్చునే వీలుంది. దీంట్లో ప్రయాణిస్తూనే దాడులు నిర్వహించే వీలుంటుంది. గన్ పోర్ట్, వ్యూ గ్లాస్ వంటి ఏర్పాట్లు సాయుధ బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దీని దృఢమైన బాడీకి తగిన విధంగానే పవర్ ఫుల్ టర్బో చార్జ్ డ్ ఇంజిన్ అమర్చారు.
ఇక ఈ మార్క్స్ మన్ వెహికిల్ ను బాలిస్టిక్ స్టీల్ తో తయారుచేశారు. దానివల్ల లోపలున్న వారికి పూర్తి రక్షణ ఉంటుంది. గ్రనేడ్లు కూడా ఈ వాహనాన్ని ఏమీ చేయలేవు. ప్రస్తుతం ఆరు వాహనాలు రూపొందించి విమానాశ్రయాల్లో భద్రతా విధులు నిర్వర్తించే సీఐఎస్ఎఫ్ బలగాలకు అందించారు.