Telugudesam: అక్కకి చెప్పండి, చెల్లికి చెప్పండి, అన్నకి చెప్పండి, తమ్ముడికి చెప్పండి... మీరు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో!: జగన్ పై యామిని సాధినేని ఫైర్

  • జగన్ చేసేవన్నీ చావు రాజకీయాలు
  • ప్రజలు ఛీ కొడతారు
  • టీడీపీ మహిళానేత విమర్శనాస్త్రాలు

టీడీపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ యామిని సాధినేని మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రి మరణం నుంచి బాబాయ్ మరణం వరకు అన్నీ రాజకీయం చేయాలని ప్రయత్నించాడని ఆరోపించారు. జగన్ ను చూస్తే ప్రజలు ఛీకొట్టే పరిస్థితి ఉందని అన్నారు. సహజమరణం అయినా, మరే ఇతర మరణం అయినా తన రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకునే జిత్తులమారి నక్క జగన్ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన అందిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

"వాన్ పిక్ లో 28,000 ఎకరాలు, లేపాక్షిలో 8,888 ఎకరాలు , 113 సెజ్ ల పేరుతో 5 లక్షల ఎకరాలను అప్పనంగా వారి బినామీల పేరు మీద మార్పించుకున్న వ్యక్తి... నేటికీ ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతున్న వ్యక్తి... ఇవాళ అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకోవడం ఆయన పిచ్చి భ్రమగా భావించాలి. అవ్వకి చెప్పండి, అన్నకి చెప్పండి, తమ్ముడికి చెప్పండి, అమ్మకి చెప్పండి, అక్కకి చెప్పండి అంటూ మాట్లాడుతుంటారు.... అదే మేం కూడా అడుగుతున్నాం... ఏడు సంవత్సరాలుగా మీపై సీబీఐ, ఈడీ ఎందుకు విచారణ జరుపుతున్నాయో అక్కకి చెప్పండి, అన్నకి చెప్పండి, చెల్లికి చెప్పండి, తమ్ముడికి చెప్పండి! మీరేం తప్పు చేయకపోతే ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో చెప్పండి!" అంటూ నిలదీశారు.  

అంతేగాకుండా, జగన్ పేర్కొంటున్న పారిశ్రామిక విధానంపైనా విమర్శలు చేశారు. "దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరికి చంపించిన నరహంతకుడు జగన్. రెండు వందల మంది తెలుగింటి ఆడపడుచుల పుస్తెలు తెగడానికి కారణమైన నాయకుడు జగన్.. ఇప్పటికీ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు జగన్ కు ప్రజల ముందుకెళ్లి నాకు ఓటెయ్యండి అని అడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాను.

అయ్యా జగన్ గారూ, మీలాంటి నాయకుడు పరిశ్రమల రాయితీల గురించి మాట్లాడితే పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉంది. కనీసం మీరు అధికారంలోకి వస్తున్నట్టు కల వచ్చినా చాలు, పారిశ్రామికవేత్తలు అట్నుంచి అటే పారిపోతారు... మీ ఘన చరిత్ర అలాంటిది మరి" అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు యామిని.

  • Loading...

More Telugu News