YSRCP: చిన్నాన్న హత్య కేసు సీబీఐకి అప్పగించాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేశా: వైఎస్ జగన్

  • వివేకానందరెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు
  • ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈ పని చేశారు 
  • ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ టీడీపీకి వాచ్ మెన్ 

వైసీపీ నేత, తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశానని వైఎస్ జగన్ చెప్పారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశారు. ఈ హత్య కేసు విషయమై గవర్నర్ కు ఓ వినతి పత్రం సమర్పించారు.

 అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హత్యకు గురైన సంఘటనపై గవర్నర్ కు వివరించానని, ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ ఘటన గురించి ఎస్పీ, డీఐజీతో మాట్లాడుతున్న సమయంలోనే ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు నుంచి వారికి చాలా సార్లు ఫోన్ కాల్స్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ టీడీపీకి వాచ్ మెన్ లా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

చనిపోయిన వ్యక్తి వివేకానందరెడ్డి సామాన్యుడు కాదని, మాజీ సీఎం సోదరుడని గుర్తుచేశారు. తమ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని గెలిపించేందుకు జమ్మలమడుగులో వివేకానందరెడ్డి విస్తృతంగా పర్యటించారని, ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వివేకాను గొడ్డళ్లతో నరికి చంపారని ఆరోపించారు. 

More Telugu News