Hyderabad: అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మరోసారి హైదరాబాద్ కు ప్రథమస్థానం
- పుణే సైతం బెస్ట్ సిటీగా గుర్తింపు
- ప్రపంచ జాబితాలో 143వ స్థానం
- రెండో స్థానంలో బెంగళూరు
వరుసగా ఐదోసారి హైదరాబాద్ నగరం భారత్ లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (ఇండియా) ర్యాంకింగ్స్-2019లో హైదరాబాద్, పుణే నగరాలు సంయుక్తంగా ప్రథమస్థానంలో నిలిచాయి. ఈ రెండు నగరాలు ప్రపంచ జాబితాలో 143వ స్థానంలో ఉన్నాయి. గతేడాది కంటే ఓ ర్యాంకు పతనం అయ్యాయి. ఆర్థిక రంగంలో పెట్టుబడులు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఆహారపదార్థాల లభ్యత, వైద్య సేవల అందుబాటు, స్థానిక, అంతర్జాతీయ నిపుణుతకు నగరంలో అవకాశాలు... వంటి అంశాల ప్రాతిపదికన ఆయా నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. హైదరాబాద్, పుణే నగరాలు సంయుక్తంగా నం.1 స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్ కతా నగరాలు ఉన్నాయి. ఇక, ప్రపంచ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానం దక్కించుకుంది. వియన్నా నం.1గా నిలవడం ఇది వరుసగా పదోసారి.