Andhra Pradesh: చంద్రబాబు దేవుళ్లను నమ్మడు.. వాళ్లను సృష్టించింది కూడా తనేనని భ్రమపడతాడు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • చంద్రబాబు రోజూ తన ఫొటోను ఎదురుపెట్టుకుని ప్రార్థిస్తారట
  • నిన్నటి విషయాలు ప్రజలకు గుర్తురాకూడదని కోరుకుంటారట
  • వరుస ట్వీట్లు చేసిన వైసీపీ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు దేవుళ్లను నమ్మరనీ, వాళ్లను సృష్టించింది తానేనని భ్రమ పడతారని ఎద్దేవా చేశారు. పొద్దున్నే తన ఫోటోనే ఎదురుగా పెట్టుకుని బాబు ప్రార్థిస్తాడనీ, ప్రజలకు నిన్నటి విషయాలేవి గుర్తు రాకుండా చేయమని వేడుకుంటాడని సెటైర్లు వేశారు. చంద్రబాబు, లోకేశ్ తలచుకుంటే రిజర్వు బ్యాంకును హ్యాక్ చేసి లక్షల కోట్లు తమ ఖాతాలోకి వేసుకోగలరని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఈరోజు వరుస ట్వీట్లు చేశారు.

చంద్రబాబు అందుకే ఏడుస్తున్నారు..
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘తనను ఇబ్బంది పెట్టేందుకే ఎన్నికలను తొలి దశలో పెట్టారని చంద్రబాబు కన్నీళ్లు కారుస్తున్నాడు. కానీ తెలంగాణ, ఏపీల్లో ఒకే రోజు పోలింగ్ జరగడమే ఆయన బాధకు అసలు కారణం. వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగితే 2014 మాదిరిగా తెలంగాణ నుంచి 10 లక్షల మందిని రప్పించి గెలవొచ్చన్నది బాబు ప్లాన్. ఈ స్కీమ్‌లు, ఎత్తులు ఇక పనిచేయవు బాబూ’ అని చురకలు అంటించారు.

‘దేవుళ్లను నేనే సృష్టించా’ అని బాబు అనుకుంటారు..
‘చంద్రబాబు దేవుళ్లను నమ్మడు, వాళ్లను సృష్టించింది తనేనని బాబు భ్రమపడతాడు. పొద్దున్నే తన ఫోటోనే ఎదురుగా పెట్టుకుని ప్రార్థిస్తాడట. ప్రజలకు నిన్నటి విషయాలేవి గుర్తు రాకుండా చేయమని వేడుకుంటాడట. మోదీ సంకలో ఉన్నప్పటి విషయం, దొంగ హామీలను ఎవరూ ప్రస్తావించొద్దని తనకు తానే మొక్కుకుంటాడట. గత ఐదేళ్లలో దేశమంతా ఓటర్ల సంఖ్య 9% పెరిగితే ఏపీలో మాత్రం 0.3% తగ్గింది. తండ్రి కొడుకుల స్కామ్ అర్థమయింది కదా. వీళ్లు తలుచుకుంటే రిజర్వు బ్యాంక్‌ను హ్యాక్ చేసి లక్షల కోట్లు తమ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు. ఇలాంటి నీచులను బంగాళాఖాతంలోకి విసిరేసి ప్రజలు పీడ వదిలించుకుంటారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ కు పొడిచేది పచ్చబొట్లే!
అలాగే ఏపీ మంత్రి నారా లోకేశ్ పై సైతం విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘పప్పు కోసం మంగళగిరిని తుప్పు ఎప్పుడో డిసైడ్ చేశాడు. ఎక్కడి నుంచైనా గెలుస్తాడనే బిల్డప్ ఇచ్చేందుకు కుల మీడియా ద్వారా ఇంకో నాలుగు పేర్లు చెప్పించాడు. మంత్రిగా పది మార్కులు రాని పప్పుకు మంగళగిరి ప్రజలు జీవితాంతం గుర్తుండేలా వాతలు పెట్టి, పచ్చబొట్లు పొడిచి వదులుతారు’ అని దుయ్యబట్టారు.
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News