Andhra Pradesh: మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం!

  • మంగళగిరిలో బలంగా ఉన్న పార్టీ
  • లోకేశ్ రాకతో ప్లస్ అవుతుందంటున్న నేతలు
  • దీటైన అభ్యర్థిని పోటీలో పెట్టేందుకు వైసీపీ ఎత్తులు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలో టీడీపీ బలీయంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు.

మంగళగిరి టికెట్ ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కాకుండా ఓ బీసీ నేతకు కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగబోతున్న నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు దీటైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

లోకేశ్ తొలుత విశాఖలోని భీమిలి నియోజకవర్గం లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి రంగంలోకి దిగుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో మనసు మార్చుకున్న లోకేశ్ రాజధానికి సమీపంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వైసీపీ నేత ఆర్కే చేతిలో ఓడిపోయారు.
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
mangalagiri
YSRCP
rk

More Telugu News