Andhra Pradesh: 'ఎన్నికల షెడ్యూల్' నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

  • భవిష్యత్తు ఆలోచించి ఓటేయండి
  • ఓటు దొంగలున్నారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక
  • నామినేషన్లు తెలంగాణలో వేస్తారా అంటూ జగన్ పై లోకేశ్ సెటైర్
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ స్పందించారు. ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఓటు దొంగలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తమ ఓటును కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు అనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. ప్రజలు తమ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకుని, ఒకవేళ లేకపోతే ఫారం-6 ద్వారా ఓటు పొందాలని తెలిపారు. ఓట్లు తొలగించేందుకు ఓటు దొంగలు వచ్చారని, వారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

ఇక, నారా లోకేశ్ ఎప్పట్లానే జగన్ పై సెటైర్లు గుప్పించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే వైసీపీ నాయకత్వం తెలంగాణలోని లోటస్ పాండ్ లో సమావేశమైందని, ఒకవేళ ఏపీ ఎన్నికల సంఘంపై నమ్మకంలేదని తెలంగాణలో గానీ నామినేషన్లు వేస్తారా ఏంటి? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణలో ఉన్న లోటస్ పాండ్ లో వైసీపీ నేతలతో జగన్ సమావేశం అయ్యారని, సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఎవరు రావాలి? ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అంటూ లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Nara Lokesh
Jagan

More Telugu News