Jammu And Kashmir: ఎన్నికల షెడ్యూల్ లో లేని జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ పోల్స్

  • ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించిన ఒమర్ అబ్దుల్లా
  • కాశ్మీర్లో ఎన్నికల కోసం ప్రపంచమంతా వేచిచూస్తోంది
  • రాజ్ నాథ్ ఇచ్చిన హామీ ఏమైందంటూ నిలదీసిన మాజీ సీఎం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుంచో సమస్యాత్మకంగా ఉన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మాత్రం ఈ షెడ్యూల్ లో ప్రకటించకపోవడం విమర్శలకు అవకాశమిస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రకటనలో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు చోటుచేసుకోకపోవడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. బీజేపీ-పీడీపీ సంకీర్ణం కుప్పకూలిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈసారైనా ఎన్నికలు నిర్వహిస్తారనుకుంటే మరోసారి నిరాశకు గురిచేశారని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ తన తప్పిదాన్ని ఓ అంతర్జాతీయ వేదికపై ఒప్పుకుంటారని ఆశించడం పొరబాటే అవుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపిస్తానని లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ, అఖిలపక్ష సమావేశంలోనూ హామీ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్ దీనికి ఏమని చెబుతారు? అంటూ నిలదీశారు ఒమర్ అబ్దుల్లా. 1996 తర్వాత సకాలంలో కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరగకపోవడం ఇదే ప్రథమం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ-పీడీపీ సంకీర్ణం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపించారు.
Jammu And Kashmir

More Telugu News