Odisha: ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు

  • రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రకటన
  • బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు చేసిన నవీన్ పట్నాయక్
దేశంలోనే తొలిసారిగా ఓ కీలక నిర్ణయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎస్ హెచ్ జీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంటుకి 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్టు చెప్పారు. భారత్ లో మహిళలు సాధికారత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనా దేశాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా మహిళా సాధికారతే మార్గమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడాలని, ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.
Odisha
BJD
woman
33 per cent
parliament

More Telugu News