Telangana: కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి రహస్య భేటీ.. మధ్యవర్తిత్వం చేసిన ఒవైసీ!

  • ఇప్పటికే పార్టీ వీడిన కార్తీక్ రెడ్డి
  • హైకమాండ్ తీరుపై సబిత అసంతృప్తి
  • త్వరలోనే టీఆర్ఎస్ లోచేరే అవకాశం
తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? పార్టీలో కీలక నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? అంటే విశ్వసనీయవర్గాలు అవుననే జవాబు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ టికెట్ దక్కకపోవడంతో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై సబిత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కారెక్కడానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు వీలుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వం నడిపారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన నేపథ్యంలో సబిత రాజీనామా కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,227 ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు.  
Telangana
KTR
sabita
indrareddy
MIM
Asaduddin Owaisi
secret meet

More Telugu News