Andhra Pradesh: ‘ఓటుకు నోటు’ కేసులో పారిపోయిన పిరికిపంద చంద్రబాబు!: తలసాని శ్రీనివాసయాదవ్

  • చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతారు
  • రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుంది
  • సిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ నేత
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇంకో రెండు నెలల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆంధ్రా సెటిలర్లను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారనీ, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

సిరిసిల్ల జిల్లా కొమురవెల్లి మల్లన్నను తలసాని ఈరోజు దర్శించుకున్నారు. మంత్రి హోదాలో తలసాని తొలిసారి మల్లన్న దర్శనానికి రావడంతో ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో పారిపోయిన పిరికిపంద చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన టీడీపీని బాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టారని దుయ్యబట్టారు.

ఏపీ ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు పసుపు-కుంకుమ పథకాన్ని తీసుకొచ్చారని తలసాని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు విషపూరితమైన మాటలను మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని ఆలయాలకు మహర్దశ కలిగిందని తలసాని అభిప్రాయపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ మరో తిరుపతిలా అభివృద్ధి  చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
TRS
Talasani

More Telugu News