Chandrababu: 5 కోట్ల మంది నిరసన చెబితే ఎలా ఉంటుందో ఇవాళే మోదీకి తెలియాలి: చంద్రబాబు

  • ఎక్కడికక్కడ ధర్మ పోరాట నిరసనలు
  • ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలి
  • నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని ఇవాళే ఆయనకు తెలిసేలా చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 5 కోట్ల మంది నిరసన నేడు ప్రతిబింబించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మోదీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, వీటిల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించారు. ఎక్కడికక్కడ ధర్మ పోరాట నిరసనలకు దిగాలని పిలుపునిచ్చారు.

నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రాష్ట్రంపై మరో కుట్రేనని, విశాఖ జోన్ ప్రకటన ఓ మాయా ప్రకటనని అభివర్ణించిన చంద్రబాబు, మోదీని అడ్డుకుని తీరుతామని అన్నారు. ఇప్పటివరకూ తాను 12 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షలు పూర్తి చేశానని, ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా మిగతా 13 ఎంపీ స్థానాల సమీక్షలు పూర్తవుతాయని చెప్పారు. మరో ఐదారు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Narendra Modi
Vizag
Dharmaporatam

More Telugu News