Hyderabad: కాటేదాన్ పరుపుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎస్సై చొరవతో ప్రాణాలతో బయటపడిన 550 మంది విద్యార్థులు

  • నిప్పురవ్వలు పడడంతో అంటుకున్న మంటలు
  • పక్కనే ఉన్న స్కూలు భవనంలోకి వ్యాపించిన వైనం
  • స్థానికుల సాయంతో విద్యార్థులను రక్షించిన ఎస్సై
హైదరాబాద్ శివారులోని కాటేదాన్‌లో ఉన్న ఓ పరుపుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ యంత్రం నుంచి ఎగిరిపడిన నిప్పు రవ్వల కారణంగా మంటలు అంటుకోగా క్షణాల్లోనే అవి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న ఫినిక్స్ ప్రైవేటు పాఠశాలలో ఆ సమయంలో 550 మంది విద్యార్థులున్నారు. ఉదయం పదిన్నర సమయంలో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదానికి గురికాగా, క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న పాఠశాలకు వ్యాపించాయి.

మంటలు, పొగకు ఉక్కిరి బిక్కిరి అయిన విద్యార్థులు హాహాకారాలు చేశారు. పై అంతస్తులో నుంచి బయటపడలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని విల్లవిల్లాడారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న మైలార్‌దేవుపల్లి ఎస్సై నదీం హుసేన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అలాగే, స్థానికులు, టీఆర్ఎస్ నేత ఫయీం సాయంతో విద్యార్థులను భవనం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న పరిశ్రమల నుంచి నిచ్చెనలు తెప్పించి విద్యార్థులను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Hyderabad
Katedan
mylardevpally
Fire Accident
School
Students

More Telugu News