askar: ‘పీరియడ్‌' సమస్యలతో రూపొందించిన భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ పురస్కారం!

  • రుతుక్రమం సమయంలో బాలికలు ఎదుర్కొనే సమస్యలకు దృశ్య రూపం
  • భారతీయ చిత్ర పరిశ్రమకు అరుదైన గౌరవం
  • దర్శక, నిర్మాతలు రేకా జెహతాబ్చి, మోంగా
భారతీయ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ న్యాయనిర్ణేతల మనసు చూరగొని అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జరుగుతున్న 91వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు సొంతం చేసుకుంది.

భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆడపిల్లలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ‘పీరియడ్‌’. చిన్న డాక్యుమెంటరీతో భారతీయ చిత్ర పరిశ్రమ కీర్తిప్రతిష్టలను ఆస్కార్‌ వరకు తీసుకు వెళ్లగలిగారు దర్శక, నిర్మాతలు రేకా జెహతాబ్చి, మోంగాలు. ఏటా ఆస్కార్‌కు పలు భారతీయ చిత్రాలు నామినేట్‌ కావడమే తప్ప అవార్డుకు వచ్చే సరికి నిరాశే ఎదురయ్యేది. అటువంటిది ఓ డాక్యుమెంటరీకి అత్యున్నత పురస్కారం లభించడం చారిత్రాత్మకం. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు.

‘ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారు’ అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. అవార్డు ప్రకటించగానే ‘ఓ మైగాడ్‌.. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై నేను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చింది. నా అనందాన్ని మాటల్లో చెప్పలేను’ అంటూ దర్శకురాలు రేకా జెహతాబ్చి ఉద్వేగానికి లోనయ్యారు. అవార్డు సమాచారం అందగానే ‘మనం గెలిచాం. ఈ భూమ్మీదున్న ప్రతి ఆడపిల్ల తనను తాను ఓ దేవతలా భావించాలి’ అంటూ నిర్మాత గునీత్‌ మోంగా ట్వీట్‌ చేశారు.
askar
period
monga
reka jehatabchi
losangeles

More Telugu News