Pakistan: మాటకు కట్టుబడి ఉన్నా...ఆధారాలు చూపండి: మోదీకి పాక్‌ ప్రధాని విజ్ఞప్తి

  • పుల్వామా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
  • ప్రకటన విడుదల చేసిన పాక్‌ పీఎంఓ
  • శాంతికోసం ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌ ప్రమేయంపై ఆధారాలుంటే ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఉగ్రవాద దాడులను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదని, ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ హెచ్చరించగా, దాడి చేస్తే తిప్పికొడతామని పాక్‌ బదులిచ్చింది.

ఈ సందర్భంగా భారత్‌ ప్రధాని మోదీ స్పందిస్తూ ‘పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశాను. ఇన్నాళ్లు పోట్లాడుకున్నామని, ఇకపై పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ఐక్యంగా కృషి చేద్దామని కోరాను. ఇమ్రాన్‌ స్పందిస్తూ తాను పఠాన్‌ల కుమారుడినని, అబద్ధాలు చెప్పనని ఆ సందర్భంలో అన్నారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటారో? లేదో చూడాలి’ అని గుర్తు చేశారు.

దీనిపై పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలు చూపాలని కోరింది. ఇరు దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్‌ విజ్ఞప్తి చేశారు.
Pakistan
imrankhan
Narendra Modi
pulwama incident

More Telugu News