Gujarat High Court: ‘నీ సంగతి చూస్తా’ అనడం నేరం కాదు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

  • మీ అంతు చూస్తానన్న లాయర్‌ను లోపలేసిన పోలీసులు
  • అది నేరపూరిత బెదిరింపు కాదన్న ధర్మాసనం
  • ఎఫ్ఐఆర్‌ను కొట్టేసిన హైకోర్టు
2017లో అరెస్ట్ అయిన ఓ న్యాయవాది కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నీ అంతు చూస్తా, లేదంటే మీ సంగతి తేలుస్తా (మై తుఝే దేఖ్ లూంగా) అనడం నేరం కాదని పేర్కొంది. అది నేరపూరితమైన బెదిరింపు కానే కాదని తేల్చి చెప్పింది.

సబర్‌కాంత జిల్లాలోని ప్రంతిజ్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ మొహిసిన్ చలోటియా 2017లో తన క్లయింట్‌ను కలుసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.  అక్కడ పోలీసులకు, ఆయనకు మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వివాదంలో పోలీసులను అంతు చూస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘‘మీ అందరి సంగతి చూస్తా.. మిమ్మల్ని కోర్టుకీడుస్తా’’ అని లాయర్ బెదిరించినట్టు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మీ అంతుచూస్తానని బెదిరించారంటూ లాయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ‘మీ అంతు చూస్తా’ అనేది నేరం కాదని స్పష్టం చేసింది. మీ అంతు చూస్తాననడం నేరపూరిత బెదిరింపు కిందకు రాదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.
Gujarat High Court
FIR
lawyer
Gujarat
Police

More Telugu News