kcr: హవాలా డబ్బు కోసమే జగన్ లండన్ వెళ్లారు: చంద్రబాబు

  • ఎన్నికల ముందు ఏ నాయకుడూ విదేశీ పర్యటనలకు వెళ్లరు
  • తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతల్లో కనిపించడం లేదు
  • ఏపీపై కేసీఆర్ కు అసూయ, ద్వేషాలు ఉన్నాయి
వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ వెళ్లారని ఆయన ఆరోపించారు. జగన్ విదేశీ పర్యటనలన్నీ హవాలా డబ్బులు తెచ్చుకునేందుకేనని అన్నారు. ఎన్నికల ముందు ఏ నాయకుడూ విదేశీ పర్యటనలకు వెళ్లరని చెప్పారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారని... ఏపీకి 90 శాతం హామీలను పూర్తి చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతలలో కనిపించడం లేదని... ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు.

ఏపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసూయ, ద్వేషాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. కేసుల మాఫీ కోసం మోదీతో, డబ్బుల కోసం కేసీఆర్ తో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. ఉగ్రదాడులపై గతంలో సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలనే తాము ప్రస్తావించామని... అప్పటి ప్రధాని మన్మోహన్ పై మోదీ ఏం మాట్లాడారో అదే ఇప్పుడు తాము గుర్తు చేశామని చెప్పారు. 
kcr
jagan
modi
amit shah
chandrababu
Telugudesam
ysrcp
TRS
bjp

More Telugu News