Amit Shah: నెహ్రూ కాకుండా పటేల్ ప్రధాని అయ్యుంటే కశ్మీర్ సమస్యే వచ్చేది కాదు: అమిత్ షా

  • కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కాషాయ సేనాని
  • విమర్శలకు దీటైన జవాబు
  • రాజమహేంద్రవరం సభలో ఆవేశపూరిత ప్రసంగం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాజమహేంద్రవరం సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్ అంశం వివాదాస్పదం కావడానికి జవహర్ లాల్ నెహ్రూనే కారణమని ఆరోపించారు. ఆనాడు నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయ్యుంటే కశ్మీర్ సమస్యే తలెత్తేది కాదని అన్నారు.

కాశ్మీర్ ను సాకుగా చూపి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, ఈ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరొకరు కాదని ఉద్ఘాటించారు అమిత్ షా. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆవేశపూరితంగా సాగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గనుక దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే మాత్రం ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు.

యావత్ భారతం అమర జవాన్లకు నివాళి అర్పిస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పుల్వామా దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఫిల్మ్ షూటింగ్ లో బిజీ అయ్యారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఈ కోవలోకే వస్తాయని అన్నారు. సరిగ్గా పుల్వామా ఘటన జరిగిన సమయంలో ప్రధాని ఓ ఈవెంట్ లో ఉన్నారని, దాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని షా మండిపడ్డారు.
Amit Shah
BJP

More Telugu News