Japan: నవయవ్వనంపై ఆశలు రేకెత్తిస్తున్న జపాన్ మొక్క!

  • అషితబ మొక్కపై పరిశోధనలు
  • వార్ధక్యాన్ని నివారించే లక్షణాలున్నట్టు గుర్తింపు
  • ఆస్ట్రియా శాస్త్రవేత్తల వెల్లడి

మనిషికి వందేళ్ల ఆయుష్షు అంటారు. మారిన జీవనశైలి కారణంగా జీవనకాలం చాలా తగ్గిపోయింది. 50 ఏళ్లకే వార్ధక్య లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రియా పరిశోధకులు ఓ జపాన్ మొక్కలో యవ్వనాన్ని కాపాడే కారకాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి ద్వారా మనిషి జీవనకాలం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది.

 ఆ మొక్క పేరు అషితబ. దీని శాస్త్రీయనామం ఏంజెలికా కీష్కీయి కోయిడ్జుమి. దీని ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి. ఇది ప్రాచీన కాలం నుంచి జపాన్ లో ఔషధ మొక్కగా ప్రాచుర్యంలో ఉంది. తాజాగా ఆస్ట్రియాకు చెందిన గ్రాజ్ యూనివర్శిటీ పరిశోధకులు దీంట్లో అరుదైన కారకాలు ఉన్నట్టు కనుగొన్నారు. మానవ చర్మంలో నిత్యం పోగుపడే మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడే పదార్థాన్ని సైంటిఫిక్ పరిభాషలో 4,4'-డైమిథోక్సీచాల్కోన్ లేక డీఎంసీ అని పిలుస్తారు. అయితే ఈ డీఎంసీ పదార్థం అషితబ మొక్కలో సహజసిద్ధంగా ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.

అషితబ మొక్కలో మృతకణాలను తొలగించడంలో ఈ నేచురల్ డీఎంసీ విశేషంగా సహకరిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను ఆటోఫజీ అని పిలుస్తారు. అషితబ మొక్క తనలోని మృతకణాలను అత్యంత సమర్థవంతంగా తొలగించుకోవడం ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫ్రాంక్ మడీయోను విపరీతంగా ఆకర్షించింది. అషితబ మొక్కలోని డీఎంసీ పదార్థం ద్వారా మానవుల్లో వార్ధక్య నివారణ ఔషధాలు తయారుచేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. ఈ అషితబ డీఎంసీ ద్వారా మానవుని చర్మంలోని మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా నవయవ్వనం సాధ్యమేనని తన నివేదికలో వివరించారు ఫ్రాంక్ మడీయో.

More Telugu News