Andhra Pradesh: కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ఖర్చు చేయట్లేదు: అమిత్ షా

  • ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం తీసుకొచ్చింది
  • ఇక్కడి విమానాశ్రయం అభివృద్ధికి రూ.180 కోట్లు ఇచ్చాం
  • ‘ఉగ్ర’ దాడి ఘటనను రాజకీయం చేయొద్దు

ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటిని వినియోగించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా ఆరోపించారు. రాజమహేంద్ర వరంలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక లాలా చెరువు వద్ద ఉభయగోదావరి జిల్లాల పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ఐదేళ్లలో ఇరవై ప్రతిష్టాత్మక సంస్థలను ఏపీకి కేంద్రం తీసుకొచ్చిందని, గెయిల్, హెచ్పీసీఎల్ సంస్థలు లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడులుగా పెడుతున్నట్టు చెప్పారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్న అమిత్ షా, రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి రూ.180 కోట్లు ఇచ్చామని అన్నారు.

ఈ సందర్భంగా పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ‘ఉగ్ర’దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాజకీయాలకు ఓ హద్దు ఉంటుందని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూడటం తగదని హితవు పలికారు. సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, సైనికుల్లో ఆత్మస్థయిర్యం నింపేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు.

More Telugu News