Jammu And Kashmir: పుల్వామా ఉగ్రఘాతుకాన్ని ముక్తకంఠంతో ఖండించిన ప్రపంచదేశాలు

  • ముష్కరుల అంతానికి ఐక్యపోరాటం చేయాలని పిలుపు
  • భారత్‌తో కలిసి పోరాడుతామన్న అమెరికా
  • మసూర్‌ అజార్‌పై నిషేధం ప్రతిపాదనకు మద్దతు పలకాలన్న ఐరాస

ఉగ్రమూకల పీచమణచాలంటే ఐక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సూసైడ్‌ బాంబర్‌ దాడి ఘటనను ప్రపంచంలోని అన్నిదేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఢీకొట్టిన ఘటనలో 43 మంది జవాన్లు అమరులు కాగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదుల చర్యను అమానవీయ ఘటనగా వర్ణించిన అమెరికా, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రదాడిని హేయమైన చర్యగా ప్రకటించిన ఆస్ట్రేలియా ఉగ్ర పోరుపై భారత్‌తో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాన్స్‌, జర్మనీ, బంగ్లాదేశ్‌, శ్రీలంకలు కూడా దాడిని ఖండించి అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపాయి.

 కాగా భారత్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఐరాస ప్రధాన కార్యదర్శి అమరుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూర్‌ అజార్‌పై నిషేధం విధించాలన్న భారత్‌ ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు పలకాలని కోరారు.

More Telugu News