KVP: నాకు, కాంగ్రెస్ కు మధ్య చంద్రబాబు అగాధాన్ని సృష్టిస్తున్నారు!: కేవీపీ సంచలన విమర్శలు

  • ఇప్పుడొచ్చి పోరాటమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు
  • నావంటి అల్పజీవిపై తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు
  • రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ కు మధ్య గొడవలు పెడుతున్నారు
  • పార్లమెంట్ లో మీడియాతో మాట్లాడిన కేవీపీ
చంద్రబాబునాయుడు తనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య అగాధాన్ని సృష్టించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లుగా తాను ఒంటరి పోరాటాన్ని చేస్తున్నానని గుర్తు చేశారు. ఎన్నో గంటలు వెల్ లో ఒక్కడినే నిలబడ్డానని, ఇప్పుడు తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అన్నారు. తనకు ఆరోగ్యం సహకరించక పోయినా హోదా కోసం పోరాడుతున్నానని కేవీపీ వ్యాఖ్యానించారు.

తన వంటి అల్పజీవిపై చంద్రబాబు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల క్రితమే ఏపీకి ప్రత్యేక హోదాపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కాంగ్రెస్ పార్టీ నినాదం కూడా అదేనని చెప్పారు. తనకు తెలిసినంత వరకూ రాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తానెక్కడా అడ్డుకోలేదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కు, జాతీయ కాంగ్రెస్ కు మధ్యలో చంద్రబాబు గొడవలు పెడుతున్నారని కేవీపీ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్నామంటూ ఇప్పుడొచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
KVP
Congress
Chandrababu
Media
Parliament

More Telugu News