Chandrababu: దేశంలోనే సంచలనంతో పాటు చరిత్ర సృష్టించాం: చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా, తాను జరిపిన ధర్మపోరాట దీక్షను దేశమంతా చూసిందని నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, న్యూఢిల్లీ దీక్ష ఓ సంచలనమని, ఈ దీక్షతో సరికొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. ఓ రాష్ట్ర హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పోరాటం గతంలో ఎన్నడూ జరగలేదని, విపక్షాలన్నీ ఏపీ కోరికలు న్యాయమైనవేనని చెప్పాయని గుర్తు చేశారు.

ధర్మపోరాట దీక్షను విజయవంతం చేసిన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలకు అభినందనలు తెలిపిన ఆయన, దీక్ష ఇచ్చిన స్ఫూర్తితో, కేంద్రంపై మరింతగా ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. బీజేపీ దుర్మార్గపు పాలనను ఇక ఒక్క రోజు కూడా సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ దీక్ష ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని అవమానించామని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 తప్పుడు పనులు చేసేవాళ్లే మనపై ఎదురు నిందలు వేస్తున్నారని, తన కుటుంబాన్ని నరేంద్ర మోదీ విమర్శించిన తరువాతనే తాను మోదీ కుటుంబాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో అంటకలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు టీడీపీని, తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. పనిచేసే కార్యకర్తలందరికీ తాను గుర్తింపునిస్తానని, టీడీపీని శాశ్వతంగా అధికారంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
Go Back to Shorts
Chandrababu
New Delhi
Dharmaporatam

More Telugu News