Andhra Pradesh: విభజన గాయాలపై కారం చల్లి రాక్షసానందం పొందాలని మోదీ చూస్తున్నారు!: సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • రేపు గుంటూరులో నోరు పారేసుకుంటారు
  • అన్నింటికి మానసికంగా సిద్ధంగా ఉండాలి
  • టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ విభజన గాయాలపై కారం చల్లి ప్రధాని మోదీ రాక్షసానందం పొందాలని చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు విమర్శించారు. చేసిన దుర్మార్గాన్ని చూసేందుకు రేపు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశ, నిస్పృహలతో మోదీ నోరు పారేసుకుంటున్నారనీ, రేపు గుంటూరులో సైతం అదే వైఖరిని ప్రదర్శించబోతున్నారని దుయ్యబట్టారు. అన్నింటికి మానసికంగా సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో అమరావతిలో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మోదీ పర్యటన ఏపీని అపవిత్రం చేస్తుందన్న చంద్రబాబు.. పసుపు, నలుపు చొక్కాలు, బెలూన్లతో ఆయనకు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. మహాత్ముడి స్ఫూర్తితో రేపు, ఎల్లుండి చీకటి రోజులుగా నిరసనలు తెలపాలన్నారు. మోదీ ద్రోహంపై ప్రతిపక్ష నేత జగన్ ఒక్క మాట కూడా మాట్లాడరనీ, వైసీపీ-బీజేపీ కుమ్మక్కు అయ్యాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

జగన్ రెండేళ్లుగా అసెంబ్లీకి రావడం లేదనీ, వైసీపీ అయితే నాలుగు సెషన్లకు డుమ్మా కొట్టిందన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా సేవకు అనర్హులన్నారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడం దేశానికి అప్రతిష్టగా మారిందని విమర్శించారు. రాఫెల్ బురదలో మోదీ కూరుకుపోయారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Narendra Modi
Guntur District

More Telugu News