Andhra Pradesh: ప్రేమను ఒప్పుకోని బాలిక.. పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు!

  • ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘటన
  • తీవ్రంగా గాయపడ్డ యువతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తన ప్రేమను ఒప్పుకోనందుకు ఓ యువకుడు రాక్షసుడిగా మారాడు. నో చెప్పిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చివరికి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు నోరు విప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కౌతాలం గ్రామానికి చెందిన మొహిద్దీన్ అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమించమంటూ వేధించేవాడు. ఈ తతంగం కొన్ని నెలలుగా కొనసాగింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెకు దూరంగా ఉండాలని మొహిద్దీన్ ను హెచ్చరించారు. అయినా నిందితుడు తన తీరును మార్చుకోలేదు.

ఈరోజు బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండటాన్ని గమనించిన మొహిద్దీన్ లోపలకు వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి డిమాండ్ చేశాడు. దీనికి యువతి ససేమిరా అనడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడే అగ్గిపెట్టె, పెట్రోల్ డబ్బా పడేసి ఆ అమ్మాయే ఆత్మహత్యకు ప్రయత్నించిందనేలా సీన్ సృష్టించాడు.

అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. యువతి హాహాకారాలు విన్న స్థానికులు మంటలను ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Andhra Pradesh
Kurnool District
petrol
immolation
torched
love rejected
Police

More Telugu News