YSRCP: కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యం ఇది: వైఎస్ జగన్

  • మీకు తగిలిన ప్రతిగాయం నా గుండెకు తగిలినట్టే
  • మీ అందరి బాగోగులు నేను చూసుకుంటా
  • మన ప్రభుత్వం కోసం సవ్యసాచులై పనిచేయాలి
తిరుపతి సమర శంఖారావంకు హాజరైన వారిని చూస్తుంటే.. కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంలా ఉందని వైసీపీ అధినేత జగన్ అభివర్ణించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న వైసీపీ ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, బూత్ కమిటీలకు దిశా నిర్దేశం చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి తన వెంట నడిచారని, చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారని అన్నారు.

‘మీకు తగిలిన ప్రతిగాయం నా గుండెకు తగిలినట్టే. మీ అందరి బాగోగులు నేను చూసుకుంటా. అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటా. రాజకీయంగా, సామాజికంగా ఆదుకుంటా. చాలా గర్వంగా చెబుతున్నా, మీరందరూ నా కుటుంబసభ్యులు’ అని అన్నారు.3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల బాధలు చూశానని, గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని,దేవుడు ఆశీర్వదించి, ప్రజల చల్లని దీవెనలతో తమ ప్రభుత్వం వస్తే కనుక సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని అన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, వైసీపీ అధికారంలోకి రావాలంటే మీరందరూ బాధ్యత తీసుకోవాలని, మన ప్రభుత్వం రావడం కోసం మీరందరూ సవ్యసాచులై పనిచేయాలని పిలుపు నిచ్చారు.
YSRCP
ys jagan
samara shankaravam
Tirupati

More Telugu News